Friday, May 2, 2008

‘గూడు’కట్టని నిర్లక్ష్యం!


ఇళ్ల స్థానంలో బోర్డు మిగిలింది
ఉపాధీ ఎండమావే
పోలేపల్లి సెజ్‌ నిర్వాసితుల దుస్థితి
--------------------------------------------------------
పోలేపల్లి నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి
పోలేపల్లి పోలేపల్లి ప్రత్యేక ఆర్థికమండలి (సెజ్‌) కోసం భూమిని ధారపోసిన అభాగ్యులు అడుగడుగునా వంచనకు గురవుతున్నారు. వారికిచ్చిన హామీలు ఆచరణకు ఆమడదూరంలో ఉండిపోతున్నాయి. సెజ్‌ కారణంగా నిర్వాసితులయ్యే వారికి 200 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఘనంగా హామీ ఇచ్చింది. అది నేటికీ ఆచరణకు నోచుకోలేదు. ఇళ్లకోసం స్థలం కేటాయించినట్లు సూచిస్తూ బోర్డు మాత్రం ఆర్భాటంగా పాతారు. అంతకుమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఉపాధి కల్పనకు ఇచ్చిన హామీ కూడా ఎండమావిగా మారుతోంది.మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి వద్ద 969 ఎకరాలను 2003లో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) సేకరించింది. ఈ భూమిలో 250 ఎకరాలను ప్రత్యేక ఆర్థిక మండలి కోసం ఔషధ కంపెనీలకు కేటాయించింది. ఇందులో అరబిందో ఫార్మాకు, హెట్రో డ్రగ్స్‌ కంపెనీలకు 75 ఎకరాల చొప్పున కేటాయించింది. ఈ సంస్థలు నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టడంతో భూమిని కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. రైతులు గట్టిగా ప్రతిఘటించడంతో పోలీసులు వారిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఏపీఐఐసీ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు (నెం:82/07) నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు జిల్లా కలెక్టర్‌ మానవహక్కుల సంఘానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. రైతుల ప్రతిఘటన, పోలీసు కేసుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఓ సమావేశం జరిగింది. సెజ్‌లో ఏర్పాటు కానున్న పరిశ్రమల్లో నిర్వాసితులకు కుటుంబంలో ఒకరికి చొప్పున ఉపాధి కల్పిస్తామని అంగీకరించారు. దీంతో పాటు 200 చదరపు గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణంతోపాటు అందుబాటులో ఉంటే సాగుకు ప్రభుత్వ భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులపై నమోదు చేసిన క్రిమినల్‌ కేసులు ఉపసంహరించుకోవడం, బాధితులు నిర్మాణ పనులు అడ్డుకోకుండా ఉండటం కూడా ఒప్పందంలో ముఖ్యమైనవి.
ఈ మేరకు కేసును లోక్‌అదాలత్‌ ద్వారా రాజీ చేసుకోవడానికి గత ఏడాది అక్టోబరు 11న కేసు ఉపసంహరణ పిటిషన్‌ దాఖలు చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా… మిగిలిన రెండు హామీల విషయంలో మాత్రం చుక్కెదురైంది. మందుల పరిశ్రమ కంపెనీలు నిర్మాణం ప్రారంభించే సమయానికి నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయని, జనవరి ఆఖరునాటికి ఇళ్లలో చేరవచ్చని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు నిర్మాణమే మొదలు కాలేదు. నిర్వాసితుల ఇంటి నిర్మాణాలకు కేటాయించిన స్థలం కూడా ఔషధ కంపెనీలను ఆనుకొనే ఉంది. ఈ కంపెనీలనుంచి వెలువడే కాలుష్యానికి అక్కడ నివాసం ఉండగలరా అన్నది ప్రశ్న.



ఇక నిర్వాసితులకు ఉపాధి అంశం కూడా కాగితాలకే పరిమితమయ్యేలా ఉంది. నిర్వాసితుల్లో ఎక్కువమంది దళితులు, గిరిజనులే. ఈ కుటుంబాల్లో చదువుకున్నవారు చాలా తక్కువ. ప్రస్తుతం వీరికి లభిస్తున్న ఉపాధి తమ భూముల్లో చేపట్టిన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేయడమే. నిర్మాణ పనులు ఎవరి భూముల్లో జరుగుతుంటే వారికి మాత్రమే కూలి పని ఇస్తామని మొదట కంపెనీల ప్రతినిధులు మెలిక పెట్టారు. నిర్వాసితులు నిలదీయడం, అధికారులు జోక్యంతో అందరికీ కూలి పనులు ఇచ్చేందుకు అంగీకరించారు. కార్డులు ఇచ్చి వారిని పనిలోకి తీసుకుంటున్నారు. అయితే ఈ పనులు చేయలేక తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. తనకున్న ఐదెకరాల భూమి తీసుకొన్నారు, కూలి పని చేస్తుండగా కాలు దెబ్బతగిలింది, అయినా పని చేయక తప్పడం లేదని బచ్చన్న నిర్వాసితుడు వాపోయారు. ఇనుప కమ్మీలు మోయడం లాంటి పనులు చేయలేకపోతున్నామని ఓ మహిళ వాపోతే, మీ చేత కాదు వెళ్లిపోండని చెప్తున్నారని గంగమ్మ అనే మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.





No comments: