Monday, May 5, 2008

మాటల్లో సంక్షేమం, చేతుల్లో సంక్షోభం!

మల్లెపల్లి లక్ష్మయ్య
అక్రమంగా అసైన్డ్‌భూములను కలిగివున్నవారికి వాటిని క్రమబద్ధీకరించరాదని ఈ నెల ఒకటవ తేదీన రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టానికి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సవరణను వ్యతిరేకిస్తూ, అది రాజ్యాంగపరంగా చెల్లదని, అంతేగాక ఈ సవరణ చట్టం మౌలిక స్వభావానికి విరుద్ధమని ప్రముఖ న్యాయవాది బొజ్జా తార కం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే, అక్రమంగా ఆధీనంలో ఉంచుకున్న అసైన్డ్‌ భూములను ఎవరికివారుగా అప్పగిస్తే ఎటువంటి శిక్షలు ఉండవని విధించిన గడుపు ఏప్రిల్‌ 29వ తేదీతో ముగిసింది. కానీ ఎవ్వరూకూడా అప్పగించిన దాఖలాలు లేవు. అయితే రాష్ట్ర రెవెన్యూ అధికారులు ఎవరి దగ్గర ఎంత అసైన్డ్‌ భూమి ఉన్నదనే వివరాలను సేకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలకే పరిమితమైతే కొంత ఆశ కలుగకమానదు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
చాలాచోట్ల పేదలు ముఖ్యంగా దళితులు తమ చేతుల్లో ఉన్న భూములను కోల్పోతున్నారు. గతంలో ఎవరో ప్రైవేటువ్యక్తులు దళితుల భూమిని ఏదోవిధం గా ఆక్రమించుకునేవారు. కానీ నేడు ప్రభుత్వమే ఆ పని చేస్తున్నది. దానివల్ల ఇంకా తొందరగా పేదలు, దళితులు, ఆదివాసులు తమ చేతుల్లో ఉన్న భూములను కోల్పోతున్నారు. ఇక్కడే ఇటీవల అసెం బ్లీలో జరిగిన అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టానికి జరిగిన సవరణను ప్రస్తావించాలి. సవరణకు ముందు ఈ చట్టం అసైన్డ్‌ భూములు పొందినవాళ్ళకు రక్షణగా ఉండేది. కానీ ఇప్పుడు అలాకాదు. 'అన్యాక్రాంతమైన అసైన్డ్‌భూములను ప్రభుత్వం తిరిగి స్వా ధీనం చేసుకొని ఎవరికైతే కేటాయించారో వారికే తిరిగి ఇవ్వాలి' అని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సవరణ దానికి భిన్నంగా ఉన్నది. అన్యాక్రాంతమైన అసైన్డ్‌భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని గతంలో ఎవరికైతే కేటాయించారో వారికే ఇవ్వవచ్చు, అవసరాన్నిబట్టి, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉం చుకుని ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.
ప్రైవేట్‌ వ్యక్తుల కు కూడా కేటాయించవచ్చునని మార్చారు. ఇది ప్రభుత్వ వ్యూహా న్ని తెలియజేస్తున్నది. సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండళ్ళ) ఏర్పాటు చేయాలనే ఆలోచనను దృష్టిలో ఉంచుకునే ఈ రకమైన నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రజా ప్రయోజనాల పేరిట ఏర్పాట య్యే ఎటువంటి సంస్థలు, పరిశ్రమలు, పార్కులు అన్నింటికీ ఎక్కువగా దళితుల భూములనే ముందుగా లాక్కున్నారు. మన హైదరాబాద్‌ నగరంలో 30 ఏళ్ళ క్రితం నిర్మించిన ఇందిరాపార్క్‌ కోసం దళితుల చేతుల్లో ఉన్న పదెకరాల భూమిని ప్రభుత్వం లాక్కున్నది. దానిపక్కనే ఉన్న ఒక ఒక ఆధిపత్యకులానికి చెందిన వ్యక్తి భూమిని ముట్టుకోనైన లేదు. ఆ వ్యక్తి ఆ భూమిని అమ్ముకుని కోట్లు సంపాదించుకున్నాడు. ఇది ఒక ఉదాహరణ. నగరం అవతల ఏర్పాటైన అనేకమైన సంస్థలు కూడా అసైన్డ్‌భూములనే తేలికగా లాగేసుకున్నాయి. ఇవేకాకుండా రియల్‌ ఎస్టేట్‌ దందా కోసం వేలా ది ఎకరాల భూదాన్‌ భూములను వ్యాపారులు దళిత రైతులనుంచి అక్రమంగా ఆక్రమించుకున్నాయి.
దీనిపై ఎన్నో కేసులు నమోదు అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. నగరం చుట్టూ ఈ రోజు జరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దళితుల భూములనే కబళిస్తున్నది. ఇట్లా అన్యాక్రాంతమైన భూమిని తిరిగి వారికి స్వాధీనం చేయకుండా, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారికే ఆ భూమిని అప్పగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం శోచనీయం. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (1989) ప్రకారం ఎవరైనా అక్రమంగా దళితుల భూములను ఆక్రమించుకుంటే, వారిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ చేయాల్సి ఉంటుంది. నిజానికి ము ఖ్యమంత్రి కుటుంబం ఆ ప్రాసిక్యూషన్‌కు సిద్ధం కావాల్సి ఉండింది. చట్టాన్ని గౌరవించి అలా చేసి, మిగతావాళ్ళందరిని ఆ ప్రకారం శిక్షి స్తే, ముఖ్యమంత్రి ఆదర్శనాయకుడు అయ్యేవాడు. కానీ ఆయనే చట్టంనుంచి తప్పుకోవడానికి అసైన్డ్‌ చట్టానికి సవరణ తేవడంతోపాటు, మిగతావాళ్ళందరిని రక్షించే బాధ్యతను నెత్తిమీద వేసుకున్నారు.
దీనివల్ల దళితులు, పేదలు, ఆదివాసులు అభివృద్ధిలో మ రింత కిందికి అంటే పాతాళానికి దిగబడక తప్పని స్థితి. ఇందిరమ్మ రాజ్యం నడుపుతున్నట్లు ప్రచారం చేస్తున్న ప్రభు త్వం ఆమె అనుసరించిన విధానాలకు భిన్నంగా మాత్రమేగాక, పూర్తిగా ఆ ఆనవాళ్లు లేకుండా ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా దళితులకు, పేదలకు ఇందిరమ్మ కాలంలోనే భూములు దక్కాయి. అది వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. దానివల్లనే ఇప్పటికే ఇందిరమ్మ పట్ల ఎస్సీ, ఎస్టీలు ఎంతో గౌరవాన్ని, భక్తిని కలిగివున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇందిర మ్మ పేరును మలినం చేసేవిధంగా ఉంది. మహబూబ్‌నగర్‌జిల్లా బాలానగర్‌ మండలం పోలేపల్లి గ్రామం లో పేదలు, దళితులు ఎదుర్కొంటున్న విషయాన్ని పరిశీలిద్దాం. ఈ గ్రామం జడ్చర్లకు దగ్గరలో ఉంది. గ్రామం కొంత లోపలికి ఉన్నప్పటికీ భూములు మాత్రం బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్‌పార్కు పేరుతో ఇక్కడ దాదాపు ఎనిమిది వందల ఎకరాల భూమిని సేకరిం చింది. ఇందులో 400 ఎకరాలకుపైబడి పట్టా భూమికాగా, మిగతాది దళితులకు, లంబాడాలకు ఇచ్చిన అసైన్డ్‌ భూమి. ప్రజలంతా వ్యతిరేకించినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. రోడ్డుకు దగ్గరగా ఉన్న భూమి లక్షన్నరగా, కొద్దిగా లోపలికి ఉంటే లక్ష, మరికొంత లోపలికి ఉంటే 50 వేల రూపాయల ధరతో పట్టా భూములను ప్రభు త్వం తరఫున ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సేకరించింది. అయితే దీనికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీల దగ్గర తీసుకున్న అసైన్డ్‌భూమికి ఎకరానికి కేవలం రూ. 18 వేల ధరను నిర్ణయించారు. కానీ వీళ్ళకు చెల్లించింది మాత్రం రూ. 9 వేలేనని చెబుతున్నారు. ఇదొక కథ. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రంగు మారింది. ఇదే గ్రీన్‌పార్కును సెజ్‌గా మార్చారు. అరబిందో, హెట్రో ఫార్మాసూటికల్‌ కంపెనీలకు ఈ భూమిని ప్రభుత్వం అమ్మివేసింది. ఎస్సీ, ఎస్టీలు, బీసీల దగ్గర రూ.18వేల నుంచి లక్షన్నర చెల్లించి స్వాధీనం చేసుకున్న భూమిని ఈ కంపెనీలకు ఎకరాకు తొమ్మిది లక్షలకు అమ్మారు.
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా ప్రభుత్వం ఇక్కడ అవతారం ఎత్తింది. ఈ తీరును ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా సెజ్‌ల పేరుతో సేకరిస్తున్న భూమిలో ఎక్కువభాగం పేదలు, దళితులదే. చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం ప్రజలు ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం పనిచేయడానికి బదులుగా పారిశ్రామికవేత్తల, ఆధిపత్యకులాల కొమ్ముకాస్తున్నదనడానికి ఇంతకన్నా సాక్ష్యం అక్కరలేదు. ఒకవైపు భూముల ను లాక్కుంటున్నది, రెండోవైపు ఆ భూములను పేదలకు పంచుతున్నామని ప్రచారం చేసుకుంటున్నది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఎక్కువశా తం నిధులను భూములున్న రైతులకు, పరిశ్రమలు ఉన్న ఆధిపత్యకులాలకు పెంచిపెడ్తూ, చట్టపరంగా రావాల్సిన నిధులను కూ డా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడం లేదు. ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే, తమదే సంక్షేమరాజ్యమని చెప్పుకోవడం వైరుధ్యంకాదా? ఇటువంటి విధానాలతో నడుస్తున్న ప్రభుత్వంనుంచి పేదలు, దళితులు, ఆదివాసీలు ఏదైనా ప్రయోజ నం ఆశిస్తే అత్యాశకాక మరేమవుతుంది.

Friday, May 2, 2008

Rejoice the death of Telangana farmers in Polepalli

Let's embrace today the rose thorns
and play holi in courtyard of dora's gadi
for the lips that got sealed tight over pothireddypadu dam

Let's sing till throats slit in praise of
the courage for waving rose colored flag
in honor of those who sold away Telangana lands

Lets lick armpits and felicitate sacrifices of those
who butchered at the village bodrai
the umbilical cord of land with the farmer

Why think of whatever happens to anybody
isn't Telangana that is all we need after all?
And……..
bury each other in our asses as there is no land left for a graveyard
Long live Telangana

ex-pression in words the anger of Polepalli SEZ farmers

by - Madhu Kagula
Mahbubnagar District Convenor,

Telangana Aikya Karyacharana Committee

Translated by -
M. Bharath Bhushan

PS: explanation of local context may be required for things like rose thorns, rose flag, dora gadi and bodrai. otherwise its the SEZ as elsewhere

CRY FROM THE LAND OF FARMERS SUICIDES

పోతిరెడ్డిపాడు పై పెదవి విప్పని
గులాబి ముళ్ళని కౌగిలించుకుని
దొరల గడిల ముంగల హోలీ ఆడుదాం

తెలంగాణ భూముల్ని తెగనమ్మినోనికి
గులాబి జెండానూపి దారిచూపినోని నమ్మకానికి
గొంతులు తెగేదాక పాటపాడుదాం

వూరి బొడ్రాయి దగ్గర sez ఖడ్గంతో
రైతుకు భూమికి వున్న పేగుబందాన్ని తెగనరికినోని
త్యాగానికి సన్మానం చేసి సంకనాకుదాం

ఎవదేమైతే మనకేమి?
తెలంగాణ వస్థె చాలు
ఫిర్ .................
పాతిపెట్టుకోటానికి జాగలేక
ఒకని ముడ్లొ ఒకన్ని బొందపెట్టుకొందాం
జై తెలంగాణ

"పోలేపల్లి రైతుల ఆక్రోషానికి అక్షర రూపం"

మీ...
మధు కాగుల

జిల్లా కన్వీనర్
తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటి, మహబూబ్ నగర్

సెజ్ ల రద్దులో గోవా దారి.............ఎన్.వేణుగోపాల్


ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేస్తూ, తన పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయబోనంటూ గోవా రాష్ట్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో గోవా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల ఒత్తిడివల్ల తీసుకోక తప్పని నిర్ణయం, ఒక ఆశావహమైన మార్పుకు సంకేతంగా ఉంది.
గోవా మూవ్ మెంట్ అగెనెస్ట్ సెజ్ (జి ఎం ఎ ఎస్) అనే విభిన్న సంస్థల, రాజకీయ పక్షాల ఐక్య సంఘటన గత కొద్ది కాలంగా చేస్తున్న ఆందోళన ఫలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ ఐక్య సంఘటనలో భారతీయ జనతాపార్టీ, గోవా సురాజ్ పార్టీ వంటి రాజకీయపక్షాలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. ఈ ఐక్యసంఘటనతోపాటే చర్చి సంస్థలకు అనుబంధంగా ఉన్న ఆక్షన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థ, గోవా బచావ్ అభియాన్ అనే సంస్థకూడ గోవా నుంచి ప్రత్యేక ఆర్థిక మండలాలను పూర్తిగా రద్దుచేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.కొంతకాలంగా సాగుతున్న సెజ్ వ్యతిరేక ఆందోళన డిసెంబర్ చివరి వారంలో తీవ్రరూపం దాల్చింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ పర్యాటకశాఖ మంత్రి మతనీ సల్దానా, జి ఎం ఎ ఎస్ నాయకుడు క్రిస్మస్ తర్వాత తమ ఆందోళనను ఉధృతంచేస్తామని, నూతన సంవత్సర ఉత్సవాలకు గోవాకు వచ్చే పర్యాటకులు వెళ్లిపోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదని కూడ హెచ్చరించారు. గోవన్లు తమ పిల్లల భవిష్యత్తు కోసమూ, గోవా ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడడం కోసమూ సంవత్సరాది ఉత్సవాలను త్యాగం చేయవలసి ఉంటుందని కూడ ఆయన పిలుపు ఇచ్చారు.
రాష్ట్రంలోని అన్ని ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేయాలని కోరుతూ ఈ ఐక్య సంఘటన డిసెంబర్ 12 న ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కు ఒక విజ్ఞప్తి చేసింది. అప్పటికే రాష్ట్రంలో మొత్తం ఏడు ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాటిలో రెండిటి విషయంలో ఉత్తర్వులు కూడ వెలువడ్డాయి గాని, ప్రజా ఆందోళనల వల్ల ఆ పనులు ముందుకు సాగలేదు. ఒకవైపు ఈ ఆందోళన సాగుతుండగానే దక్షిణ గోవాలోని సాంకోలె లో మూడో ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ లోగా ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గోవాలో రెండు రోజుల పర్యటనకోసం రాగా ఆయన పాల్గొన్న సభలలో కూడ నిరసన ప్రదర్శనలు సాగాయి.
ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని సమీక్షిస్తుందనీ, ఆ విషయంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తయారుచేసిన శ్వేత ప్రత్రాన్ని నిశితంగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుందనీ ముఖ్యమంత్రి అన్నారు.
ఈ వ్యవహారాలన్నీ పరిగణనలోకి తీసుకున్న పాలకపక్షం కాంగ్రెస్ ఒక పరిశీలక బృందాన్ని నియమించింది. ఆ బృందం డిసెంబర్ 29 న ఇచ్చిన తన నివేదికలో గోవాలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయడం గోవా ప్రయోజనాలకు గాని, గోవన్ల ప్రయోజనాలకు గాని ఉపయోగకరం కాదని ప్రకటించింది. దక్షిణ గోవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యుడు, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో సర్దిన్హా ఆ బృందం అభిప్రాయాలను పత్రికలకు వెల్లడిస్తూ, సెజ్ ల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి విపరీతంగా గోవాలోకి జనం తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల రాష్ట్ర పర్యాటక రంగం మీద తీవ్రమైన ప్రభావం కలగవచ్చునని చెప్పాడు. ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగితే గోవాకు ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటక రంగం దెబ్బతినిపోతుందని అన్నాడు.
ఈ పూర్వరంగంలో గోవన్ల భూమిని పెద్ద ఎత్తున గోవనేతరులకు అమ్మడం, అన్యాక్రాంతం కావడం జరుగుతున్నదని, దాన్ని ఆపివేయాలని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోరింది. ప్రజా అవసరాల కొరకు మినహా ఈ విధంగా పారిశ్రామిక వేత్తల, పెట్టుబడిదారుల అవసరాల కొరకు ప్రభుత్వం భూసేకరణ జరపగూడదని కూడ ప్రదేశ్ కాంగ్రెస్ కోరింది.
చివరికి స్వయంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్న టాస్క్ ఫోర్స్ ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దు చేయాలని డిసెంబర్ 30న నిర్ణయం తీసుకున్నది. పారిశ్రామికీకరణ ఫలాలను రాష్ట్రానికి అందించాలనే, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యాలతోనే రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయాలనుకుంటే ఆ రెండు పనులూ ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయకుండా కూడ సాధించవచ్చునని టాస్క్ ఫోర్స్ అభిప్రాయపడింది. అంతేకాక, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల మినహాయింపులు, రాయితీల వల్ల కూడ గోవా రాష్ట్రప్రభుత్వం సాధించబోయే ఆదాయం కూడ ఏమీ ఉండబోదని టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. ఆదాయం ఏమీ లేకపోగా, ప్రత్యేక ఆర్థిక మండలాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించడంకోసం రాష్ట్రప్రభుత్వం అదనపు ఖర్చు కూడ పెట్టవలసి ఉంటుంది, నీరు, విద్యుత్తు కల్పించవలసి ఉంటుంది అని టాస్క్ ఫోర్స్ వ్యాఖ్యానించింది. వేలాది ఎకరాలను సెజ్ లకోసం కేటాయించడం వల్ల నిజంగా పరిశ్రమలు ఏర్పాటు చేయదలచుకున్న వారికి గాని, సాధారణ ప్రజల నివాస అవసరాలకు గాని భూమి దొరకదని కూడ టాస్క్ ఫోర్స్ అంది.
గోవాలో ఒక పాలకపక్ష పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలలోని పాలకపక్షాలన్నిటి కళ్లు తెరిపించాలి. నిజానికి మన దేశంలోని రాజకీయ పక్షాలన్నీ ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు అంటున్న మాటలే ఇవి. ప్రత్యేక ఆర్థిక మండలాలవల్ల స్థానిక ప్రజల ప్రయోజనాలేవీ తీరవని, అవి కేవలం దేశదేశాల సంపన్నులకు మన సంపదలు దోచిపెట్టే సాధనాలు మాత్రమేనని రాజకీయ పక్షాలన్నిటికీ కూడ తెలుసు. కాని అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు సంపాదించడం కోసమో, తమ ఆశ్రితులకో, కుటుంబ సభ్యులకో వేలాది ఎకరాల భూములు కట్టబెట్టడం కోసమో ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని తలకెత్తుకుంటున్నాయి. ఇవాళ మొదటిసారి గోవా ప్రభుత్వం అధికార పక్షంగా ఉండి కూడ ప్రజల ఒత్తిడి మేరకు నిజాలు అంగీకరించి, ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని వెనక్కి తీసుకున్నది.
ఈ విధంగా ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని ఉపసంహరించే పని ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా చేసింది గాని మిగిలిన పార్టీలేవీ తాము పాలిస్తున్న రాష్ట్రాలలో చేయలేకపోయాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర లలో తప్ప దేశమంతా ప్రత్యేక ఆర్థిక మండలాల విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వామ పక్షాలు, ప్రత్యేక ఆర్థిక మండలాల కొరకు తమ భూమి లాక్కోవద్దన్న రైతుల ప్రాణాలు బలిగొన్న వామపక్షాలు గోవా ప్రభుత్వం నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది.
ప్రత్యేక ఆర్థిక మండలాల వెనుక బహుళజాతిసంస్థలు, దేశదేశాల సంపన్నులు ఉన్నప్పటికీ బలమైన ప్రజాఉద్యమాన్ని నిర్మించగలిగితే ప్రభుత్వం మెడలు వంచి ఉపసంహరించేలా చేయవచ్చునని చూపిన గోవా ప్రజా ఉద్యమం అన్ని రాష్ట్రాలలో సెజ్ లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు ఆదర్శం కావాలి.

పోలేపల్లి విషాదగాథల బాధ్యులెవరు?........ఎన్.వేణుగోపాల్

అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్తవెలుగులు అందుకుంటున్నదెవరు? మరింత చీకట్లోకి కుంగిపోతున్నదెవరు? హైదరాబాదు అలంకరించుకున్న సరికొత్తనగ అనీ, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి ఎగరేయబోతున్న అత్యాధునిక నిర్మాణమనీ ఊదరకొడుతున్న శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, హైదరాబాదునుంచి దక్షిణంగా వెళ్లే జాతీయరహదారిమీద దేశదేశాల సంపన్నుల పెట్టుబడులు ప్రవహించి రాష్ట్రాన్నీ, దేశాన్నీ అందలాలెక్కిస్తాయనీ అమెరికాతో సమానంచేస్తాయనీ ఏలినవారూ వారిబంట్లూ నమ్మబలుకుతున్న దారి పక్కన ఏం జరుగుతున్నదో చూడండి. నిన్నటిదాకా మనుషులు కలకలలాడినచోట సమాధులు లేచి నిలుస్తున్నాయి. అంతులేని విషాదం విస్తరిస్తోంది. పల్లె కన్నీటిధారలు ఎడతెగకుండా ప్రవహిస్తున్నాయి. పచ్చని పంటపొలాలు బహుశా రసాయనాలకంపు కొట్టబోయే మొండిగోడలుగా లేచినిలుస్తూ జీవితాలను కూల్చేస్తున్నాయి. పాలకుల అభివృద్ధి మాయాజాలం నిరుపేదబతుకులను వలవేసి పట్టి మట్టుబెడుతోంది.
ఆ ఊరిపేరు ప్రస్తుతానికి పోలేపల్లి కావచ్చు. ముదిరెడ్డిపల్లి కావచ్చు. గుండ్లగడ్డ తండా కావచ్చు. నిన్న కాకినాడో, తడో, సత్యవేడో, సూళ్లూరుపేటో కావచ్చు. అంతకుముందు ఒరిస్సాలో పారాదీప్, కళింగనగర్ లు కావచ్చు. ఉత్తరప్రదేశ్ లో దాద్రి కావచ్చు. హర్యానాలో జజ్జర్ కావచ్చు. పశ్చిమబెంగాల్ లో నందిగ్రామ్, సింగూర్ లు కావచ్చు. మహారాష్ట్రలో రాయగడ్ కావచ్చు. పంజాబ్ లో బర్నాలా, అమృతసర్ లు కావచ్చు. పేర్లే మారతాయిగాని దేశంలో కనీసం మూడువేల గ్రామాలలో కనీసం పదిలక్షల కుటుంబాలలో చిచ్చుపెట్టబోతున్న “వెలుగు” ఇది. తాతముత్తాతలనాటినుంచి తమ బొడ్రాయితో, తమ కూరాటికుండలతో, తమ గుడిసెలతో, తమ జొన్నకర్రలతో, తమ కట్టమైసమ్మలతో, పోశమ్మలతో, తమ ఏడ్పులతో నవ్వులతో పండుగలతో ప్రమాదాలతో తమవైన బతుకులు బతికిన ఊళ్లు ఇప్పుడిక చెరిగిపోతాయి. ప్రత్యేక ఆర్థిక మండలం అనే కొత్త మాయదారి పేరు అద్దుకుంటాయి.
ఇవాళ్టికి పోలేపల్లి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఆ ఊరు, ఆ ఊరి ప్రజలు చేసిన పాపమల్లా హైదరాబాదు అనే దీపం నీడ కింద ఉండడమే. బహుళజాతిసంస్థల, ప్రపంచీకరణ శక్తుల, దేశదేశాల సంపన్నుల కళ్లు పడ్డప్పటినుంచీ, నూతన ఆర్థిక విధానాల మహమ్మారి సోకినప్పటినుంచీ ఆ దీపం కాంతి రోజురోజుకీ పెరిగిపోతోంది. అంతగానే దానికిందనీడలూ పెరిగిపోతున్నాయి. ఆ పెరుగుతున్న వెలుగుకు కావలసిన చమురుకోసం చుట్టూ ఐదు జిల్లాల ప్రజల పొట్టకొట్టడం మొదలయి చాల రోజులయింది.
ఆ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది ఎకరాలను “అభివృద్ధి” అవసరాల కోసం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలేపల్లి చుట్టుపట్ల వందల ఎకరాలనుంచి ప్రజలను వెళ్లగొట్టి పెద్దల అవసరాల కోసం అప్పగించాలని 2001లో అప్పటి ఆంధ్రప్రదేశ్ సిఇఓ నిర్ణయించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఆ భూమంతా ఎప్పుడో 1894లో వలసవాద ప్రభుత్వం చేసిన భూస్వాధీన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) సొంతమయిపోయింది. అప్పటినుంచి ఆ భూమిమీద ఎవరెవరి కళ్లుపడ్డాయో తెలియదు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. కాని పాలకుల నీతి ఏమీ మారలేదు. పాలకులు అనుసరించే రాజకీయార్థిక విధానాలు వారి జెండాలతో, ప్రకటనలతో నిమిత్తం లేకుండా యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడేడు సముద్రాల అవతలి తెల్లదొరలు పెట్టిన షరతుల ఫలితంగానో, వాళ్లు విసిరిన ఎంగిలిమెతుకులమీద ఆశతో స్వచ్ఛందంగానో స్వతంత్రభారతపాలకులు ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేసిన ఆ రాజకీయార్థిక విధానాలలో ఒకానొక అధ్యాయమయిన ప్రత్యేక ఆర్థిక మండలాలు మొదలయ్యాయి.
ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ లు ఇవ్వజూపుతున్న రాయితీల, సౌకర్యాల ఆకర్షణలో రాష్ట్రం నుంచి ఔషధ పరిశ్రమ తరలిపోతున్నదని, ఆ రెండు రాష్ట్రాలలో వందల పరిశ్రమలు వచ్చాయని, ఆంధ్రపదేశ్ నుంచే నలభై యాభై సంస్థలు తరలి వెళ్లాయని 2006 మొదట్లో గగ్గోలు మొదలయింది. ప్రతిస్పందనగా పాలకులు ఔషధ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేకఆర్థికమండలాన్ని స్థాపిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో మొదట 300 ఎకరాలతో ప్రారంభించి క్రమంగా వెయ్యి ఎకరాలకు విస్తరించగల సెజ్ ను ఔషధ పరిశ్రమకోసం ఎపిఐఐసి ఏర్పాటు చేయబోతున్నదని 2006 సెప్టెంబర్ లోనే వార్తలు వెలువడ్డాయి. నిజానికి సెజ్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినది 2005 మే లో. ఆ చట్టానికి సంబంధించిన నిబంధనలు తయారయినది 2006 ఫిబ్రవరిలో. కాని సెప్టెంబర్ కల్లా రాష్ట్రప్రభుత్వం ఔషధ సెజ్ ఆలోచన ప్రకటించడం, అక్టోబర్ లో కేంద్రప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన అనుమతుల బోర్డు ఈ సెజ్ కు అనుమతి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ కేంద్రప్రభుత్వ ఉత్తర్వు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ లో, జడ్చర్ల మండలం పోలేపల్లిలో 101.17 హెక్టార్ల విస్తీర్ణంలో ఫార్ములేషన్ పరిశ్రమకోసం సెజ్ స్థాపించడానికి అనుమతించింది. అరబిందో ఫార్మాసూటికల్స్, హెటెరోడ్రగ్స్ అనే పెద్ద సంస్థలు, మరికొన్ని చిన్నసంస్థలు ఇక్కడ తమ ఔషధ ఉత్పత్తి ప్రారంభిస్తాయని 2006లో అన్నారు. కాని అప్పుడు ఆపేరుతో భూమి సంపాదించుకున్న సంస్థలు కూడా ఇప్పుడు వెనక్కిపోతున్నాయని తెలుస్తోంది. అయినా చట్టప్రకారమే ఒకసారి సెజ్ గా ప్రకటించినతర్వాత సంపాదించిన భూమిలో 35 శాతాన్ని మాత్రమే చెప్పిన పనికి ఉపయోగించి, మిగిలిన 65 శాతాన్ని తమ ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి ఆ సంస్థలకు అనుమతి దొరుకుతుంది. క్రమక్రమంగా ఆ 101 హెక్టార్లు (249 ఎకరాలు) పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఎంత విస్తీర్ణానికి చేరాయో, ఏ ఔషధ కంపెనీల పేరుమీద ఏ రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి చేరాయో తెలియదు.
ఉత్తరాది రాష్ట్రాలలో తమకు అందుతాయని రాష్ట్రప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి చూపిన రాయితీలు - పది సంవత్సరాలపాటు ఎక్సైజ్ సుంకంపై మినహాయింపులు, అమ్మకంపన్ను, ఆదాయపుపన్ను పూర్తిగా రద్దు. అంటే ఇప్పుడు పోలేపల్లి సెజ్ లో ఔషధ సంస్థలు వస్తే గిస్తే కూడా అవి ఎక్సైజ్ సుంకాలు కట్టనక్కరలేదు. అమ్మకపు పన్నులు చెల్లించనక్కరలేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రజల భూమిని వాడుకుని, ప్రభుత్వం కల్పించిన విద్యుత్తు, నీరు, రవాణా, సమాచార సౌకర్యాలన్నిటినీ వాడుకుని, చౌకశ్రమతో సంపాదించిన లాభాలపై ఆదాయపు పన్ను కూడ కట్టనక్కరలేదు. మరి దేశానికీ రాష్ట్రానికీ రాష్ట్ర ఖజానాకూ వీసం కూడా లాభం చేకూర్చని, కేవలం పెట్టుబడిదార్ల లాభాలను మాత్రమే ఇబ్బడిముబ్బడిగా పెంచే ఈ పథకానికి ప్రజలు ఎందుకు త్యాగం చేయాలి? ప్రజలు తమ భూములనూ, భవిష్యత్తునూ, ప్రాణాలనూ ఎందుకు బలిపెట్టాలి? ప్రజలు తమ తాతముత్తాతలనాటినుంచి ఉన్న స్థలాలనుంచి ఎందుకు తొలగిపోవాలి?
అలా తొలగిపోయిన రైతులకు నష్టపరిహారం వస్తుందిగదా, ఇక సమస్య ఏమిటి అని కొందరు బుద్ధిమంతులు ప్రశ్నిస్తారు. కాని శాశ్వత జీవనాధారమైన భూమిని లాక్కొని ఏదో కొంత డబ్బు విదిలిస్తే అది ఎటువంటి జీవనోపాధిని, జీవన భద్రతను కల్పించగలుగుతుంది? అది కూడ మొదట ఎకరానికి రు. 18,000 నుంచి రు. 30,000 అన్నప్పటికీ లంచాలు పోగా అందులో నాలుగోవంతు కూడ బాధితులకు దక్కలేదు. ఆ కొద్దోగొప్పో నష్టపరిహారం కూడ దక్కేది భూమి ఉన్న రైతులకు మాత్రమే. మన గ్రామాలలో కనీసం సగం జనాభా అయినా భూమిలేని నిరుపేదరైతులు. వారికి దక్కేది ఏమీ ఉండదు. మరోవైపు చేతులుమారిన భూమి ఇప్పుడు పలుకుతున్న ధర ఎకరానికి నలభై లక్షల రూపాయల పైనే.
అలా తమ పొలాల నుంచి, తమ గ్రామం నుంచి బేదఖల్ చేయబడి, తమ భూములమీద తామే నిర్మాణ కూలీలుగా మారిన వేదనతో, తమ భూమి తీసుకోవద్దని పోరాడినందుకు ప్రభుత్వం బహూకరించిన లాఠీ దెబ్బలు, అరెస్టులు, జైళ్లు, కేసులు వంటి బహుమానాల అవమానాలతో, వేదనతో ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ల సంఖ్య ఇరవై నుంచి నలభై ఐదు దాకా ఎంతయినా కావచ్చు.
ఈ పాపంలో మనందరం తలాపిడికెడు పంచుకోవలసిందే. నూతన ఆర్థిక విధానాలను తెచ్చిన పాలకులు, ఆ విధానాలను గత పదిహేను సంవత్సరాలుగా కొనసాగిస్తున్న అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలు, ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టాన్ని తాము పాలిస్తున్న రాష్ట్రాలలో అమలు జరుపుతూ, ఇతరరాష్ట్రాలలో వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న రాజకీయ పక్షాలు ఈ దుర్మార్గానికి ప్రధాన బాధ్యులు. ప్రపంచీకరణ విధానాలను ఆమోదించి ఆహ్వానించిన పత్రికలు, ప్రచార సాధనాలు, ప్రపంచీకరణ వల్ల తమ విలాసాలు పెరిగితే చాలునని, పొరుగువాళ్లు ఏమయిపోయినా ఫరవాలేదని నిర్లిప్తతలోకి వెళ్లి, గొంతులేనివాళ్లకు గొంతునివ్వవలసిన సామాజిక బాధ్యత మరిచిపోయిన మధ్యతరగతి కూడ ఈ విషాదగాథలకు బాధ్యత వహించాలి. మాట్లాడగలవాళ్ల మౌనమే అసలు సమస్య.

ఇదె నిజం...ఈ జీవచ్ఛవాలే సాక్షి


మె పేరు బాలమ్మ.. చేతిలోని చిత్రం భర్త దేపల్లి వెంకయ్యది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద గ్రీన్‌పార్కు అభివృద్ధి కోసం, అటు తర్వాత ఫార్మా ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) కోసం జరిగిన భూసేకరణలో జీవనాధారమైన భూమి కోల్పోయి.. ఉపాధి కరవై.. కుటుంబాన్ని పోషించలేక పుట్టెడు దిగులుతో వెంకయ్య ప్రాణాలు కోల్పోయాడు. 'ఉసురు తీసిన సెజ్‌' శీర్షికన ఈనెల 18న 'ఈనాడు' రాసింది ఈయన గురించి. వైఎస్‌ తనయుడి పత్రిక 'సాక్షి'.. ఆ వూళ్లో ఇద్దరే వెంకయ్యలున్నారని, ఇంకెవరూ లేరని బొంకింది. మరి ఈ వెంకయ్య భార్య బాలమ్మకేం సమాధానం చెబుతుంది? వీరికి ఎకరా భూమి ఉంది. దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రత్యేక ఆర్థిక మండలికి ఇచ్చింది. ఉన్న ఎకరా పోవడంతో ఇక ఎలా బతుకుతామని దిగులుపడి తన భర్త మరణించాడని బాలమ్మ రోదిస్తూ శుక్రవారం తనను కలిసిన 'న్యూస్‌టుడే' ప్రతినిధికి చెప్పింది.
'పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రిక'- 'సాక్షి'
ఫ్యాక్షనిజంలో పుట్టి, 'ఈనాడు'పై పగబట్టి 'ఏది నిజం' పేరిట సర్వాబద్ధాల్ని ప్రచురిస్తూ అక్షరాలా రాజకీయ కక్షకు సాక్షీభూతంగా నిలుస్తోంది 'సాక్షి'!

ముప్ఫై మూడేళ్ల క్రితం పుట్టింది 'ఈనాడు'. తెలుగువారి ఆదరాభిమానాలే కొండంత అండగా ఎదిగిన 'ఈనాడు'కు ఎల్లవేళలా సత్యనిష్ఠ, ప్రజాప్రయోజనాలే ప్రాణస్పందనలు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలపక్షాన అక్షర అక్షౌహిణుల్ని మోహరించి జనహితం తెగటారిపోకుండా కాచుకోవాలన్నదే 'ఈనాడు' ఏకైక లక్ష్యం. అందుకోసమే సాగిస్తోంది అసిధారావ్రతం!
ముప్ఫై మూడు రోజుల క్రితం పుట్టింది 'సాక్షి'. తెలుగు పాత్రికేయంలో కొత్తగా వచ్చిన పత్రిక ఉన్నత వృత్తిప్రమాణాలకు కట్టుబడితే, కనీసం తానే శిరసున దాల్చిన 'సత్యమేవ జయతే'కు నిబద్ధత చాటితే పరిస్థితి భిన్నంగా ఉండేది. వచ్చిన రోజునుంచే వైఎస్‌ తనయుడి పత్రిక తండ్రి అజెండాకు అనుగుణంగా 'ఈనాడు'పై దాడిచేస్తోంది. పాఠకుల్లో గల అచంచల విశ్వసనీయతే 'ఈనాడు' మహాసౌధానికి పునాది. దాన్ని కదలబార్చడం కోసమే అబద్ధాలకు రంగులద్ది జనంలోకి వదులుతున్నారనడానికి జడ్చర్ల కథనమే తిరుగులేని సాక్ష్యం!
నిజం నిప్పు కణిక. కట్టుకథల నివురుగప్పినా అది జ్వలిస్తూనే ఉంటుంది. కోర్టులో అబద్ధపు సాక్ష్యమిచ్చేవారూ తాము సత్యహరిశ్చంద్రుడికి సన్నిహిత బంధువులమని చెప్పుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. అబద్ధాల సాక్ష్యాల తయారీకోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతుంటారు. నిజాలకు పాతరేసి, అబద్ధాల జాతర మొదలెట్టిన 'సాక్షి' దినపత్రికదీ ఇదే తంతు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తిమ్మినిబమ్మిని చేస్తోందనడానికి జడ్చర్ల సెజ్‌పై ఆ పత్రిక ప్రచురించిన కథనమే సాక్షి! జడ్చర్ల సెజ్‌లో తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న అభాగ్యుల గుండెల్ని అసత్యపు అక్షర రంపాలతో సాక్షి నిలువునా కోసింది. సెజ్‌లో సమిధలైన పాతికమందికి పైగా అభాగ్యుల కష్టాల్ని 'ఈనాడు' కళ్లకు కడితే... కాదంటూ సవాలుచేసిందీ పత్రిక. కానీ తాను చెప్పిందే నిజమని ససాక్ష్యాధారాలతో నిరూపిస్తోంది 'ఈనాడు'. ముందే వాస్తవాలు నిర్ధారించుకొని కథనాన్ని ప్రచురించినా... బాధ్యత గల పత్రికగా మరోసారి ఈనాడు, ఈటీవీ ప్రతినిధి బృందం శుక్రవారం పోలేపల్లి గ్రామానికి వెళ్లి వాస్తవాలు మరోసారి ధ్రువీకరించుకుని బాధితుల గోడుకు అక్షరరూపం ఇస్తోంది.
పోలేపల్లి నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధులు
నాదిగా భూమి, రైతు మధ్య బంధం విడదీయలేనిది. కానీ ఇప్పుడా పేగుబంధాన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌) తెగ్గోస్తున్నాయి. పచ్చటి పొలాల్లో, చక్కటి బతుకుల్లో చిచ్చు రేపుతున్నాయి. రైతు బతుకును బజారుపాలుచేస్తున్నాయి. ప్రభుత్వం విదిల్చే పరిహారపు చిల్లర డబ్బుల్తో మరోచోట భూముల్ని కొనలేక, కూలీలుగా పనిచేయలేక రైతు రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతున్నాడు. నిన్నామొన్నటిదాకా సాగుచేసిన తమ పొలాల్లోనే కూలీగా మారుతున్నాడు. గౌరవంగా బతికిన వూర్లోనే తలదించుకోవాల్సిన దుస్థితి. జడ్చర్ల సెజ్‌లో భూముల్ని కోల్పోయిన వారిదీ ఇదే పరిస్థితి.
''ఉన్న భూములు పోయాయి. ఈ బాధను తట్టుకోలేక మా భర్తలు చనిపోయారు. ఎలా బతకాలో అర్థంకావడం లేదు. మా భూముల్లోనే కూలీలుగా పనిచేస్తున్నాం. అవమానాలు ఎదుర్కొంటున్నాం''- పోలేపల్లి వద్ద సెజ్‌లో భూమిని కోల్పోయిన మహిళల దీనస్థితి ఇది. ఇక్కడ ఏ మహిళను కదిపినా కన్నీళ్లే. ''అదిగో అక్కడ జేసీబీలు పనిచేసేది మా భూమి'' అని ఒకరంటే, ''ఆ భవంతి కట్టేది మా స్థలంలోనే'' అని మరొకరు ఆవేదనతో చెబుతున్నారు. భూమిని కోల్పోయిన రైతులు కూలీలుగా మారడమే కాదు, దిగులుతో కుమిలిపోయి, విగతజీవులైన రైతులు, వారి కుటుంబాల దుస్థితిని 'ఈనాడు' వెలుగులోకి తెచ్చింది. కానీ ఇవన్నీ అబద్ధాలని, పోలేపల్లి గ్రామంలో ఇద్దరు వెంకయ్యలు మాత్రమే ఉన్నారని, వారిద్దరూ బతికే ఉన్నారని, కథనం కోసం చంపేశారంటూ అవాస్తవ, అభూత కల్పనలతో సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈనాడు పత్రికలో 'ఉసురు తీసిన సెజ్‌' శీర్షికతో ప్రచురించిన కథనంలో మరణించిన రైతులు బాలు, సీత్యానాయక్‌ ఫొటోలు వేశాం. ఈ ఇద్దరు రైతులూ చనిపోయారు. ప్రచురించిన వారి ఫొటోల కింద పేర్లు తారుమారు అయ్యాయి.
అది సాక్షి కంటికి కనిపించలేదా?
హబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి గ్రామం వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రీన్‌పార్కు పేరుతో భూసేకరణ చేపట్టింది. 2003లో 969 ఎకరాలు సేకరించింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని గ్రోత్‌ సెంటర్‌గా ప్రకటించింది. 2006 సెప్టెంబరులో ఫార్మాస్యూటికల్‌ ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రకటించింది. అరబిందో ఫార్మా, హెట్రోడ్రగ్స్‌ తదితర కంపెనీలకు కేటాయించింది. అరబిందో ఫార్మా ప్రమోట్‌చేసిన ట్రిడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ సాక్షి దినపత్రికలో రూ.6 కోట్ల 80 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. హెట్రో డ్రగ్స్‌, ల్యాబ్స్‌, హెల్త్‌కేర్‌ సంస్థల పేరిట రూ.1.94 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆ సంస్థలున్న సెజ్‌లో అంతా సవ్యమేనని చెప్పేందుకు సాక్షి పడరాని పాట్లు పడుతోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే భూసేకరణ చేపట్టారని, వెయ్యి ఎకరాలు సేకరించారని ఈనాడు తన కథనం ప్రారంభంలోనే స్పష్టంగా పేర్కొన్న విషయం సాక్షి కంటికి కనిపించలేదా? ఈనాడు పత్రిక ఉద్దేశపూర్వకంగానే దీనిని పక్కనబెట్టిందంటూ సాక్షి పేర్కొనడం బాధ్యతా రాహిత్యం కాదా?






















































































































సాక్షి దినపత్రిక నుంచి...