అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్తవెలుగులు అందుకుంటున్నదెవరు? మరింత చీకట్లోకి కుంగిపోతున్నదెవరు? హైదరాబాదు అలంకరించుకున్న సరికొత్తనగ అనీ, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి ఎగరేయబోతున్న అత్యాధునిక నిర్మాణమనీ ఊదరకొడుతున్న శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, హైదరాబాదునుంచి దక్షిణంగా వెళ్లే జాతీయరహదారిమీద దేశదేశాల సంపన్నుల పెట్టుబడులు ప్రవహించి రాష్ట్రాన్నీ, దేశాన్నీ అందలాలెక్కిస్తాయనీ అమెరికాతో సమానంచేస్తాయనీ ఏలినవారూ వారిబంట్లూ నమ్మబలుకుతున్న దారి పక్కన ఏం జరుగుతున్నదో చూడండి. నిన్నటిదాకా మనుషులు కలకలలాడినచోట సమాధులు లేచి నిలుస్తున్నాయి. అంతులేని విషాదం విస్తరిస్తోంది. పల్లె కన్నీటిధారలు ఎడతెగకుండా ప్రవహిస్తున్నాయి. పచ్చని పంటపొలాలు బహుశా రసాయనాలకంపు కొట్టబోయే మొండిగోడలుగా లేచినిలుస్తూ జీవితాలను కూల్చేస్తున్నాయి. పాలకుల అభివృద్ధి మాయాజాలం నిరుపేదబతుకులను వలవేసి పట్టి మట్టుబెడుతోంది.
ఆ ఊరిపేరు ప్రస్తుతానికి పోలేపల్లి కావచ్చు. ముదిరెడ్డిపల్లి కావచ్చు. గుండ్లగడ్డ తండా కావచ్చు. నిన్న కాకినాడో, తడో, సత్యవేడో, సూళ్లూరుపేటో కావచ్చు. అంతకుముందు ఒరిస్సాలో పారాదీప్, కళింగనగర్ లు కావచ్చు. ఉత్తరప్రదేశ్ లో దాద్రి కావచ్చు. హర్యానాలో జజ్జర్ కావచ్చు. పశ్చిమబెంగాల్ లో నందిగ్రామ్, సింగూర్ లు కావచ్చు. మహారాష్ట్రలో రాయగడ్ కావచ్చు. పంజాబ్ లో బర్నాలా, అమృతసర్ లు కావచ్చు. పేర్లే మారతాయిగాని దేశంలో కనీసం మూడువేల గ్రామాలలో కనీసం పదిలక్షల కుటుంబాలలో చిచ్చుపెట్టబోతున్న “వెలుగు” ఇది. తాతముత్తాతలనాటినుంచి తమ బొడ్రాయితో, తమ కూరాటికుండలతో, తమ గుడిసెలతో, తమ జొన్నకర్రలతో, తమ కట్టమైసమ్మలతో, పోశమ్మలతో, తమ ఏడ్పులతో నవ్వులతో పండుగలతో ప్రమాదాలతో తమవైన బతుకులు బతికిన ఊళ్లు ఇప్పుడిక చెరిగిపోతాయి. ప్రత్యేక ఆర్థిక మండలం అనే కొత్త మాయదారి పేరు అద్దుకుంటాయి.
ఇవాళ్టికి పోలేపల్లి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఆ ఊరు, ఆ ఊరి ప్రజలు చేసిన పాపమల్లా హైదరాబాదు అనే దీపం నీడ కింద ఉండడమే. బహుళజాతిసంస్థల, ప్రపంచీకరణ శక్తుల, దేశదేశాల సంపన్నుల కళ్లు పడ్డప్పటినుంచీ, నూతన ఆర్థిక విధానాల మహమ్మారి సోకినప్పటినుంచీ ఆ దీపం కాంతి రోజురోజుకీ పెరిగిపోతోంది. అంతగానే దానికిందనీడలూ పెరిగిపోతున్నాయి. ఆ పెరుగుతున్న వెలుగుకు కావలసిన చమురుకోసం చుట్టూ ఐదు జిల్లాల ప్రజల పొట్టకొట్టడం మొదలయి చాల రోజులయింది.
ఆ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది ఎకరాలను “అభివృద్ధి” అవసరాల కోసం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలేపల్లి చుట్టుపట్ల వందల ఎకరాలనుంచి ప్రజలను వెళ్లగొట్టి పెద్దల అవసరాల కోసం అప్పగించాలని 2001లో అప్పటి ఆంధ్రప్రదేశ్ సిఇఓ నిర్ణయించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఆ భూమంతా ఎప్పుడో 1894లో వలసవాద ప్రభుత్వం చేసిన భూస్వాధీన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) సొంతమయిపోయింది. అప్పటినుంచి ఆ భూమిమీద ఎవరెవరి కళ్లుపడ్డాయో తెలియదు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. కాని పాలకుల నీతి ఏమీ మారలేదు. పాలకులు అనుసరించే రాజకీయార్థిక విధానాలు వారి జెండాలతో, ప్రకటనలతో నిమిత్తం లేకుండా యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడేడు సముద్రాల అవతలి తెల్లదొరలు పెట్టిన షరతుల ఫలితంగానో, వాళ్లు విసిరిన ఎంగిలిమెతుకులమీద ఆశతో స్వచ్ఛందంగానో స్వతంత్రభారతపాలకులు ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేసిన ఆ రాజకీయార్థిక విధానాలలో ఒకానొక అధ్యాయమయిన ప్రత్యేక ఆర్థిక మండలాలు మొదలయ్యాయి.
ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ లు ఇవ్వజూపుతున్న రాయితీల, సౌకర్యాల ఆకర్షణలో రాష్ట్రం నుంచి ఔషధ పరిశ్రమ తరలిపోతున్నదని, ఆ రెండు రాష్ట్రాలలో వందల పరిశ్రమలు వచ్చాయని, ఆంధ్రపదేశ్ నుంచే నలభై యాభై సంస్థలు తరలి వెళ్లాయని 2006 మొదట్లో గగ్గోలు మొదలయింది. ప్రతిస్పందనగా పాలకులు ఔషధ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేకఆర్థికమండలాన్ని స్థాపిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో మొదట 300 ఎకరాలతో ప్రారంభించి క్రమంగా వెయ్యి ఎకరాలకు విస్తరించగల సెజ్ ను ఔషధ పరిశ్రమకోసం ఎపిఐఐసి ఏర్పాటు చేయబోతున్నదని 2006 సెప్టెంబర్ లోనే వార్తలు వెలువడ్డాయి. నిజానికి సెజ్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినది 2005 మే లో. ఆ చట్టానికి సంబంధించిన నిబంధనలు తయారయినది 2006 ఫిబ్రవరిలో. కాని సెప్టెంబర్ కల్లా రాష్ట్రప్రభుత్వం ఔషధ సెజ్ ఆలోచన ప్రకటించడం, అక్టోబర్ లో కేంద్రప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన అనుమతుల బోర్డు ఈ సెజ్ కు అనుమతి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ కేంద్రప్రభుత్వ ఉత్తర్వు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ లో, జడ్చర్ల మండలం పోలేపల్లిలో 101.17 హెక్టార్ల విస్తీర్ణంలో ఫార్ములేషన్ పరిశ్రమకోసం సెజ్ స్థాపించడానికి అనుమతించింది. అరబిందో ఫార్మాసూటికల్స్, హెటెరోడ్రగ్స్ అనే పెద్ద సంస్థలు, మరికొన్ని చిన్నసంస్థలు ఇక్కడ తమ ఔషధ ఉత్పత్తి ప్రారంభిస్తాయని 2006లో అన్నారు. కాని అప్పుడు ఆపేరుతో భూమి సంపాదించుకున్న సంస్థలు కూడా ఇప్పుడు వెనక్కిపోతున్నాయని తెలుస్తోంది. అయినా చట్టప్రకారమే ఒకసారి సెజ్ గా ప్రకటించినతర్వాత సంపాదించిన భూమిలో 35 శాతాన్ని మాత్రమే చెప్పిన పనికి ఉపయోగించి, మిగిలిన 65 శాతాన్ని తమ ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి ఆ సంస్థలకు అనుమతి దొరుకుతుంది. క్రమక్రమంగా ఆ 101 హెక్టార్లు (249 ఎకరాలు) పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఎంత విస్తీర్ణానికి చేరాయో, ఏ ఔషధ కంపెనీల పేరుమీద ఏ రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి చేరాయో తెలియదు.
ఉత్తరాది రాష్ట్రాలలో తమకు అందుతాయని రాష్ట్రప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి చూపిన రాయితీలు - పది సంవత్సరాలపాటు ఎక్సైజ్ సుంకంపై మినహాయింపులు, అమ్మకంపన్ను, ఆదాయపుపన్ను పూర్తిగా రద్దు. అంటే ఇప్పుడు పోలేపల్లి సెజ్ లో ఔషధ సంస్థలు వస్తే గిస్తే కూడా అవి ఎక్సైజ్ సుంకాలు కట్టనక్కరలేదు. అమ్మకపు పన్నులు చెల్లించనక్కరలేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రజల భూమిని వాడుకుని, ప్రభుత్వం కల్పించిన విద్యుత్తు, నీరు, రవాణా, సమాచార సౌకర్యాలన్నిటినీ వాడుకుని, చౌకశ్రమతో సంపాదించిన లాభాలపై ఆదాయపు పన్ను కూడ కట్టనక్కరలేదు. మరి దేశానికీ రాష్ట్రానికీ రాష్ట్ర ఖజానాకూ వీసం కూడా లాభం చేకూర్చని, కేవలం పెట్టుబడిదార్ల లాభాలను మాత్రమే ఇబ్బడిముబ్బడిగా పెంచే ఈ పథకానికి ప్రజలు ఎందుకు త్యాగం చేయాలి? ప్రజలు తమ భూములనూ, భవిష్యత్తునూ, ప్రాణాలనూ ఎందుకు బలిపెట్టాలి? ప్రజలు తమ తాతముత్తాతలనాటినుంచి ఉన్న స్థలాలనుంచి ఎందుకు తొలగిపోవాలి?
అలా తొలగిపోయిన రైతులకు నష్టపరిహారం వస్తుందిగదా, ఇక సమస్య ఏమిటి అని కొందరు బుద్ధిమంతులు ప్రశ్నిస్తారు. కాని శాశ్వత జీవనాధారమైన భూమిని లాక్కొని ఏదో కొంత డబ్బు విదిలిస్తే అది ఎటువంటి జీవనోపాధిని, జీవన భద్రతను కల్పించగలుగుతుంది? అది కూడ మొదట ఎకరానికి రు. 18,000 నుంచి రు. 30,000 అన్నప్పటికీ లంచాలు పోగా అందులో నాలుగోవంతు కూడ బాధితులకు దక్కలేదు. ఆ కొద్దోగొప్పో నష్టపరిహారం కూడ దక్కేది భూమి ఉన్న రైతులకు మాత్రమే. మన గ్రామాలలో కనీసం సగం జనాభా అయినా భూమిలేని నిరుపేదరైతులు. వారికి దక్కేది ఏమీ ఉండదు. మరోవైపు చేతులుమారిన భూమి ఇప్పుడు పలుకుతున్న ధర ఎకరానికి నలభై లక్షల రూపాయల పైనే.
అలా తమ పొలాల నుంచి, తమ గ్రామం నుంచి బేదఖల్ చేయబడి, తమ భూములమీద తామే నిర్మాణ కూలీలుగా మారిన వేదనతో, తమ భూమి తీసుకోవద్దని పోరాడినందుకు ప్రభుత్వం బహూకరించిన లాఠీ దెబ్బలు, అరెస్టులు, జైళ్లు, కేసులు వంటి బహుమానాల అవమానాలతో, వేదనతో ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ల సంఖ్య ఇరవై నుంచి నలభై ఐదు దాకా ఎంతయినా కావచ్చు.
ఈ పాపంలో మనందరం తలాపిడికెడు పంచుకోవలసిందే. నూతన ఆర్థిక విధానాలను తెచ్చిన పాలకులు, ఆ విధానాలను గత పదిహేను సంవత్సరాలుగా కొనసాగిస్తున్న అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలు, ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టాన్ని తాము పాలిస్తున్న రాష్ట్రాలలో అమలు జరుపుతూ, ఇతరరాష్ట్రాలలో వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న రాజకీయ పక్షాలు ఈ దుర్మార్గానికి ప్రధాన బాధ్యులు. ప్రపంచీకరణ విధానాలను ఆమోదించి ఆహ్వానించిన పత్రికలు, ప్రచార సాధనాలు, ప్రపంచీకరణ వల్ల తమ విలాసాలు పెరిగితే చాలునని, పొరుగువాళ్లు ఏమయిపోయినా ఫరవాలేదని నిర్లిప్తతలోకి వెళ్లి, గొంతులేనివాళ్లకు గొంతునివ్వవలసిన సామాజిక బాధ్యత మరిచిపోయిన మధ్యతరగతి కూడ ఈ విషాదగాథలకు బాధ్యత వహించాలి. మాట్లాడగలవాళ్ల మౌనమే అసలు సమస్య.

1 comment:
Really Heart touching. We all have to join hands to stop this evil.
- Prem
Post a Comment