ఇష్టపూర్వక ఒప్పందం ప్రకారమే జడ్చర్లలో భూ సేకరణ
రైతుల మరణాలపై పరిశీలన చేయలేదు
మహబూబ్‌నగర్ కలెక్టరు వివరణ
మహబూబ్‌నగర్ కలెక్టరు వివరణ
మహబూబ్‌నగర్, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపురం గ్రామాల్లో ఇష్టపూర్వక ఒప్పందం ప్రకారమే అభివృద్ధి కేంద్రం (గ్రోత్ సెంటర్) కోసం భూ సేకరణ చేశామని జిల్లా కలెక్టరు ఉషారాణి తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగించేలా భూ సేకరణ చేపట్టలేదని స్పష్టంచేశారు. చనిపోయిన రైతులకు సంబంధించిన సమాచారమేదీ అధికారుల వద్ద లేదన్నారు. ఆ మరణాలు ఎలా జరిగాయో.. ఎందుకు జరిగాయో పరిశీలించలేదని ఆమె శనివారమిక్కడ విలేఖరులకు తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆ రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను పూర్తిగా వివరించలేకపోతున్నట్లు చెప్పారు. అరబిందో ఫార్మా, హెట్రో డ్రగ్స్ సంస్థలు గత ఎనిమిది నెలల్లో బాధిత రైతుల డిమాండ్ మేరకు కొన్ని పనులు చేపట్టాయని తెలిపారు. ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు ఆ సంస్థలు పోలీసులకు లేఖ రాశాయని తనకు తెలుసన్నారు. భూ సేకరణలో అతి తక్కువ ధరకు ప్రభుత్వం తీసుకుందనే ఆరోపణలు వాస్తవం కాదని చెప్పారు. ‘2002లో జడ్చర్ల పరిధిలో భూముల విలువ చాలా తక్కువగా ఉంది. రైతులు ఇష్టపూర్వకంగా ఇవ్వడానికి ముందుకొచ్చాకే భూ సేకరణ చేశాం. ఏపీఐఐసీకి 969 ఎకరాలు సేకరించాం.. ఎకరాకు మార్కెట్ విలువ రూ.12 వేలుంటే.. ప్రభుత్వం 30 శాతం అదనంగా చెల్లించింది. ఇలా ఇచ్చిన అప్పటి ఆర్డీవో జయరామయ్యపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గ్రీన్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నించినా ఎవరూ రాకపోవడంతో సుమారు 250 ఎకరాలను సెజ్‌కు కేటాయించారు. ఒక్కో ఎకరాకు రూ.7 లక్షల చొప్పున కేటాయించడంతో రైతులు ఆందోళనకు దిగారు. మా వద్ద తక్కువ ధరకు తీసుకుని ఎక్కువ ధరకు ఏపీఐఐసీ అమ్ముతోందని అడ్డుకున్నారు. నాకు చాలా వినతిపత్రాలు ఇచ్చారు. చట్టప్రకారం జరిగిన భూసేకరణలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని చెప్పాం.. నిరుడు అరబిందో, హెట్రో డ్రగ్స్ సంస్థల ప్రతినిధులతో బాధిత రైతుల కమిటీ చర్చలకు అప్పటి ఎస్పీ చారు సిన్హా, నేను కలిసి ఒప్పించాం. ఆరుగురు రైతుల కమిటీతో జరిగిన ఒప్పందంలో 352 మంది రైతు కుటుంబాలకు పక్కా ఇళ్లు, మంచి నీరు, రోడ్లు, పాఠశాల కల్పించడంతో పాటు అర్హులైన వారికి ఆ సంస్థల్లో ఉద్యోగం కల్పించాలని నిర్ణయించారు. 30 ఎకరాల్లో ప్లాట్లు వేశారు.. నాలుగు నెలల క్రితం నాటి సమాచారం ప్రకారం.. 145 మందికి వాచ్‌మన్, క్లర్క్ ఇతరత్రా ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 106 మందికి సంస్థలు ఉపాధి కార్డులు ఇచ్చాయి. కొత్తగా ఇంకా ఎంతమందికి ఇచ్చారో? ఇవ్వనున్నారో తెలియదు’ అని కలెక్టరు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని రైతులు, రాజకీయ పార్టీల అవగాహన కోసమే చెబుతున్నానన్నారు.
Courtesy: Eenadu
Date: 27th April 2008
No comments:
Post a Comment