పౌరహక్కుల సంఘం వెల్లడిసర్కారుపై ధ్వజం
జడ్చర్ల గ్రామీణం - న్యూస్‌టుడే
కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలతో భూములు కోల్పోయి.. నానా బాధ అనుభవించి, రైతులు కుమిలిపోయి మరణిస్తున్నారని, దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇవి తమ నిజ నిర్ధారణలో తేలిన అంశాలని పౌర హక్కుల సంఘం పేర్కొంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. పోలేపల్లి, గుండ్లగడ్డ తండాలకు వెళ్లి.. రైతు కుటుంబాలను పరామర్శించారు. సంఘం సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో రఘునాథ్, లింగయ్య, నారాయణరావు, లక్ష్మణ్ తదితరులు వారితో మాట్లాడారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించారు.
కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న పరిస్థితులు, చేస్తున్న పోరాటాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. భూములు అప్పజెప్పి ఏళ్లు గడిస్తే ఇప్పుడెందుకు ఆందోళన చేస్తున్నారనివారిని హక్కుల సంఘం నేతలు ప్రశ్నించారు. ‘2002 నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. భూములివ్వం అన్నాం. బెదిరించారు. పరిహారం వద్దన్నాం. తీసుకోకుంటే భూమి లాక్కొని జైలుకు పంపుతాం.. ఇదికూడా రాదు అన్నారు. దాంతో డబ్బులు తీసుకున్నాం. గతేడాది వరకు పంటలు పండించాం. వాటిని తీసివేశారు. ఆందోళన చేశాం. కేసులు పెట్టారు. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడే ఆందోళన చేయడం లేదు’ అని బాధితులు బదులిచ్చారు. ‘ఇప్పుడు ఎన్నికలున్నాయని అంతా వంగి దండాలు పెడుతూ వస్తున్నరు. కానీ ఇప్పుడు మేం ఎవరికీ ఓటేయ్యం మా ఊరిని నాశనం చేసిన వారిని, మా గురించి పట్టించుకోని వారిని ఊళ్లోకిరానివ్వం’ అంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా దగ్గర భూములు లాక్కున్నారు. ఇప్పుడు సచ్చిపోతే బొందపెట్టనిస్తలేరు. జాగ లేదు’ అని గిరిజన మహిళ శివ్‌లీ వివరించారు. ఇళ్లు, స్థలాలు, ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. అనంతరం నిజనిర్ధారణ సంఘం సభ్యులు విలేఖరులతో మాట్లాడారు.
చెప్పేదొకటి.. చేసేదొకటి: సురేశ్‌కుమార్
సెజ్‌ల పేరుతో ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది. చెప్పేదొకటి చేసేదొకటి. పెద్దవాళ్లను ఇంకా పెద్దలుగా చేయడం, పేదలను ఇంకా పేదలుగా చేస్తోంది. ఇక్కడకు వచ్చి చూశాక సర్కారు వికృతరూపం బయటపడింది. జీవించే హక్కులు కాలరాస్తున్నారు. ఆదాయం, జీవనాధారం కోల్పోయి ప్రజలు అల్లాడుతున్నారు.
పోరాట క్రమంలో మరణిస్తున్నారు: రఘునాథ్
‘ఐదేళ్లుగా భూములు కోల్పోయి.. కుటుంబ పరిస్థితులు, జరుగుతున్న పరిణామాల క్రమంలో పోలేపల్లి, గుండ్లగండ తండాలో దాదాపు 40 మంది మృతి చెందారు. మా పరిశీలనలో స్పష్టంగా తేలింది. భూములు పోవడం వల్లే వారు మరణించారు. ప్రభుత్వం దళారీగా, భూములు కోల్పోయిన రైతులు కూలీలుగా మారారు.
ఆత్మగౌరవం దెబ్బతింటోంది: లక్ష్మణ్
భూములు కోల్పోయి ఆత్మ గౌరవం దెబ్బతిని దాదాపు 300 కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. కళ్లెదుటే ఉన్న భూములు పోయాయి. కూలీలయ్యామని బెంగ వారిని వేధిస్తోంది. ఇందిరాగాంధీ ఎస్సీ, ఎస్టీలకు భూములను పంచితే వైఎస్ ప్రభుత్వం లాక్కుంటోంది.
ఎవరికిచ్చారు ఉద్యోగం: లింగయ్య
జిల్లా కలెక్టరు వివరణ పరిశీలిస్తే వాస్తవాలు వేరే ఉన్నాయి. ఎవరికీ ఉద్యోగాలు కల్పించలేదు. కూలీ చేస్తున్నారు. ఇళ్ల స్థలాలివ్వలేదు. కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. అంతా బూటకం. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బాధితుల పక్షాన పోరాడే వారి దృష్టి మళ్లించడానికే వివరణ ఇచ్చారు.
న్యాయం జరిగేదాకా ఉద్యమం: నంగారాభేరి
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లి గుండ్లగడ్డతండా సెజ్ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని లంబాడ హక్కుల పోరాట సమితి(నంగరాభేరి) ప్రకటించింది. ప్రభుత్వం పేదల నుంచి వందల ఎకరాల భూమి లాక్కుని పెద్దలకు కట్టబెట్టిందని నంగారాభేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ శేషురాంనాయక్ ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రైతుల్ని వారి భూముల్లోనే కూలీలుగా మార్చిన ప్రభుత్వానికి లంబాడాలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. భూములు కోల్పోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు లాక్కోవడంతోపాటు అక్రమ కేసులు బనాయించి బాధితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Courtesy: Eenadu
Date: 28th April 2008
No comments:
Post a Comment