Friday, May 2, 2008

ఇదె నిజం...ఈ జీవచ్ఛవాలే సాక్షి


మె పేరు బాలమ్మ.. చేతిలోని చిత్రం భర్త దేపల్లి వెంకయ్యది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద గ్రీన్‌పార్కు అభివృద్ధి కోసం, అటు తర్వాత ఫార్మా ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) కోసం జరిగిన భూసేకరణలో జీవనాధారమైన భూమి కోల్పోయి.. ఉపాధి కరవై.. కుటుంబాన్ని పోషించలేక పుట్టెడు దిగులుతో వెంకయ్య ప్రాణాలు కోల్పోయాడు. 'ఉసురు తీసిన సెజ్‌' శీర్షికన ఈనెల 18న 'ఈనాడు' రాసింది ఈయన గురించి. వైఎస్‌ తనయుడి పత్రిక 'సాక్షి'.. ఆ వూళ్లో ఇద్దరే వెంకయ్యలున్నారని, ఇంకెవరూ లేరని బొంకింది. మరి ఈ వెంకయ్య భార్య బాలమ్మకేం సమాధానం చెబుతుంది? వీరికి ఎకరా భూమి ఉంది. దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రత్యేక ఆర్థిక మండలికి ఇచ్చింది. ఉన్న ఎకరా పోవడంతో ఇక ఎలా బతుకుతామని దిగులుపడి తన భర్త మరణించాడని బాలమ్మ రోదిస్తూ శుక్రవారం తనను కలిసిన 'న్యూస్‌టుడే' ప్రతినిధికి చెప్పింది.
'పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రిక'- 'సాక్షి'
ఫ్యాక్షనిజంలో పుట్టి, 'ఈనాడు'పై పగబట్టి 'ఏది నిజం' పేరిట సర్వాబద్ధాల్ని ప్రచురిస్తూ అక్షరాలా రాజకీయ కక్షకు సాక్షీభూతంగా నిలుస్తోంది 'సాక్షి'!

ముప్ఫై మూడేళ్ల క్రితం పుట్టింది 'ఈనాడు'. తెలుగువారి ఆదరాభిమానాలే కొండంత అండగా ఎదిగిన 'ఈనాడు'కు ఎల్లవేళలా సత్యనిష్ఠ, ప్రజాప్రయోజనాలే ప్రాణస్పందనలు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలపక్షాన అక్షర అక్షౌహిణుల్ని మోహరించి జనహితం తెగటారిపోకుండా కాచుకోవాలన్నదే 'ఈనాడు' ఏకైక లక్ష్యం. అందుకోసమే సాగిస్తోంది అసిధారావ్రతం!
ముప్ఫై మూడు రోజుల క్రితం పుట్టింది 'సాక్షి'. తెలుగు పాత్రికేయంలో కొత్తగా వచ్చిన పత్రిక ఉన్నత వృత్తిప్రమాణాలకు కట్టుబడితే, కనీసం తానే శిరసున దాల్చిన 'సత్యమేవ జయతే'కు నిబద్ధత చాటితే పరిస్థితి భిన్నంగా ఉండేది. వచ్చిన రోజునుంచే వైఎస్‌ తనయుడి పత్రిక తండ్రి అజెండాకు అనుగుణంగా 'ఈనాడు'పై దాడిచేస్తోంది. పాఠకుల్లో గల అచంచల విశ్వసనీయతే 'ఈనాడు' మహాసౌధానికి పునాది. దాన్ని కదలబార్చడం కోసమే అబద్ధాలకు రంగులద్ది జనంలోకి వదులుతున్నారనడానికి జడ్చర్ల కథనమే తిరుగులేని సాక్ష్యం!
నిజం నిప్పు కణిక. కట్టుకథల నివురుగప్పినా అది జ్వలిస్తూనే ఉంటుంది. కోర్టులో అబద్ధపు సాక్ష్యమిచ్చేవారూ తాము సత్యహరిశ్చంద్రుడికి సన్నిహిత బంధువులమని చెప్పుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. అబద్ధాల సాక్ష్యాల తయారీకోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతుంటారు. నిజాలకు పాతరేసి, అబద్ధాల జాతర మొదలెట్టిన 'సాక్షి' దినపత్రికదీ ఇదే తంతు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తిమ్మినిబమ్మిని చేస్తోందనడానికి జడ్చర్ల సెజ్‌పై ఆ పత్రిక ప్రచురించిన కథనమే సాక్షి! జడ్చర్ల సెజ్‌లో తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న అభాగ్యుల గుండెల్ని అసత్యపు అక్షర రంపాలతో సాక్షి నిలువునా కోసింది. సెజ్‌లో సమిధలైన పాతికమందికి పైగా అభాగ్యుల కష్టాల్ని 'ఈనాడు' కళ్లకు కడితే... కాదంటూ సవాలుచేసిందీ పత్రిక. కానీ తాను చెప్పిందే నిజమని ససాక్ష్యాధారాలతో నిరూపిస్తోంది 'ఈనాడు'. ముందే వాస్తవాలు నిర్ధారించుకొని కథనాన్ని ప్రచురించినా... బాధ్యత గల పత్రికగా మరోసారి ఈనాడు, ఈటీవీ ప్రతినిధి బృందం శుక్రవారం పోలేపల్లి గ్రామానికి వెళ్లి వాస్తవాలు మరోసారి ధ్రువీకరించుకుని బాధితుల గోడుకు అక్షరరూపం ఇస్తోంది.
పోలేపల్లి నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధులు
నాదిగా భూమి, రైతు మధ్య బంధం విడదీయలేనిది. కానీ ఇప్పుడా పేగుబంధాన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌) తెగ్గోస్తున్నాయి. పచ్చటి పొలాల్లో, చక్కటి బతుకుల్లో చిచ్చు రేపుతున్నాయి. రైతు బతుకును బజారుపాలుచేస్తున్నాయి. ప్రభుత్వం విదిల్చే పరిహారపు చిల్లర డబ్బుల్తో మరోచోట భూముల్ని కొనలేక, కూలీలుగా పనిచేయలేక రైతు రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతున్నాడు. నిన్నామొన్నటిదాకా సాగుచేసిన తమ పొలాల్లోనే కూలీగా మారుతున్నాడు. గౌరవంగా బతికిన వూర్లోనే తలదించుకోవాల్సిన దుస్థితి. జడ్చర్ల సెజ్‌లో భూముల్ని కోల్పోయిన వారిదీ ఇదే పరిస్థితి.
''ఉన్న భూములు పోయాయి. ఈ బాధను తట్టుకోలేక మా భర్తలు చనిపోయారు. ఎలా బతకాలో అర్థంకావడం లేదు. మా భూముల్లోనే కూలీలుగా పనిచేస్తున్నాం. అవమానాలు ఎదుర్కొంటున్నాం''- పోలేపల్లి వద్ద సెజ్‌లో భూమిని కోల్పోయిన మహిళల దీనస్థితి ఇది. ఇక్కడ ఏ మహిళను కదిపినా కన్నీళ్లే. ''అదిగో అక్కడ జేసీబీలు పనిచేసేది మా భూమి'' అని ఒకరంటే, ''ఆ భవంతి కట్టేది మా స్థలంలోనే'' అని మరొకరు ఆవేదనతో చెబుతున్నారు. భూమిని కోల్పోయిన రైతులు కూలీలుగా మారడమే కాదు, దిగులుతో కుమిలిపోయి, విగతజీవులైన రైతులు, వారి కుటుంబాల దుస్థితిని 'ఈనాడు' వెలుగులోకి తెచ్చింది. కానీ ఇవన్నీ అబద్ధాలని, పోలేపల్లి గ్రామంలో ఇద్దరు వెంకయ్యలు మాత్రమే ఉన్నారని, వారిద్దరూ బతికే ఉన్నారని, కథనం కోసం చంపేశారంటూ అవాస్తవ, అభూత కల్పనలతో సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈనాడు పత్రికలో 'ఉసురు తీసిన సెజ్‌' శీర్షికతో ప్రచురించిన కథనంలో మరణించిన రైతులు బాలు, సీత్యానాయక్‌ ఫొటోలు వేశాం. ఈ ఇద్దరు రైతులూ చనిపోయారు. ప్రచురించిన వారి ఫొటోల కింద పేర్లు తారుమారు అయ్యాయి.
అది సాక్షి కంటికి కనిపించలేదా?
హబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి గ్రామం వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రీన్‌పార్కు పేరుతో భూసేకరణ చేపట్టింది. 2003లో 969 ఎకరాలు సేకరించింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని గ్రోత్‌ సెంటర్‌గా ప్రకటించింది. 2006 సెప్టెంబరులో ఫార్మాస్యూటికల్‌ ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రకటించింది. అరబిందో ఫార్మా, హెట్రోడ్రగ్స్‌ తదితర కంపెనీలకు కేటాయించింది. అరబిందో ఫార్మా ప్రమోట్‌చేసిన ట్రిడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ సాక్షి దినపత్రికలో రూ.6 కోట్ల 80 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. హెట్రో డ్రగ్స్‌, ల్యాబ్స్‌, హెల్త్‌కేర్‌ సంస్థల పేరిట రూ.1.94 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆ సంస్థలున్న సెజ్‌లో అంతా సవ్యమేనని చెప్పేందుకు సాక్షి పడరాని పాట్లు పడుతోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే భూసేకరణ చేపట్టారని, వెయ్యి ఎకరాలు సేకరించారని ఈనాడు తన కథనం ప్రారంభంలోనే స్పష్టంగా పేర్కొన్న విషయం సాక్షి కంటికి కనిపించలేదా? ఈనాడు పత్రిక ఉద్దేశపూర్వకంగానే దీనిని పక్కనబెట్టిందంటూ సాక్షి పేర్కొనడం బాధ్యతా రాహిత్యం కాదా?






















































































































No comments: